అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి పత్రికలు, ఛానల్స్ ను కేసీఆర్ కబ్జా చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. యూట్యూబ్ ఛానల్స్ వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈటల. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణి అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని.. ప్రభుత్వం రెడీనా? అంటూ సవాల్ విసిరారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ గనులతో తెలంగాణను బొందలగడ్డగా మార్చారని కేసీఆర్ ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు ఈటల. రాష్ట్రం రాకముందు ఉన్న 12 ఓపెన్ కాస్ట్ గనులు.. ఇప్పుడు 20కి ఎలా పెరిగాయని ప్రశ్నించారు. బొగ్గు బ్లాక్ ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. కోయగూడెం బ్లాక్ ను అరబిందో శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టి లబ్ధి పొందారని ఆరోపించారు.
హుజూరాబాద్ లో తనను ఓడించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. అక్రమంగా సంపాదించిన 600 కోట్లను కేసీఆర్ హుజూరాబాద్ లో నీళ్లలా ఖర్చు పెట్టారని వివరించారు. ‘‘తెలంగాణ ప్రజలకు రెండు చేతులు జోడించి చెబుతున్నా. కేసీఆర్ అక్రమ డబ్బు సంచులతో గెలవాలని చూస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేది మీరే’’ అని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని ఆరోపించారు ఈటల.
బీజేపీతో 45 సంవత్సరాల అనుబంధం ఉన్న వెంకట్ రెడ్డి పార్టీని వీడారంటే.. ఏ స్థాయిలో ప్రలోభపెట్టారో అర్థం అవుతోందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటిదాకా ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మాయ చేస్తున్నారని.. రింగ్ రోడ్డును తాకట్టు పెట్టారని.. విచ్చలవిడిగా భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ వచ్చిన తర్వాతే నీచ రాజకీయాలు మొదలయ్యాయని.. ముఖ్యమంత్రి చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు ఈటల. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు ప్యాకేజీలిచ్చి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రలోభాలకు, నిర్బంధాలకు గురిచేసి అష్టదిగ్బంధనాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. ఎవడి పాలైందిరో తెలంగాణ అన్న పాట పాడిన ఏపూరి సోమన్నను నిర్బంధాలకు గురిచేసి లాగేసుకుంటున్నారని చెప్పారు.
పరీక్షలు నిర్వహించడం చేతకాని ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదన్న రాజేందర్.. ధనిక రాష్ట్రం అప్పులపాలైందని తెలిపారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, దేవాలయ భూములు అమ్ముకుంటూ పాలన సాగిస్తున్నారని.. దసరాలో నిర్వహించాల్సిన మద్యం వేలం పాటను ముందుగానే నిర్వహించి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించే వారిని కేసులతో బెదిరించి జైలుపాలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఆఖరికి కేంద్రమంత్రిని సైతం ఈడ్చుకుంటూ వెళ్లిన ఈ ప్రభుత్వం గోళ్ళతో రక్కిందని విమర్శించారు. ఎన్నికలోస్తే ప్రజాప్రతినిధులకు విలువ కడుతూ కేసీఆర్ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా హుజూరాబాద్ లో ఇచ్చిన తీర్పును ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని కోరారు ఈటల రాజేందర్.