Telugu News » Eatala Rajender : కేసీఆర్ దళిత ద్రోహి!

Eatala Rajender : కేసీఆర్ దళిత ద్రోహి!

తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని తెలిపారు. రాష్ట్రం వచ్చాక కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. దళిత ముఖ్యమంత్రి హామీపై మోసగించారని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినట్టే ఇచ్చి అవమానకరంగా తీసివేశారన్నారు.

by admin
eatala-rajender-fire-on-telangana-cm-kcr

అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలనే సోయి కేసీఆర్ (KCR) కు లేదన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender). రంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల స్థాయి అధ్యక్షుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల ప్రసంగించారు. భారత దేశం అమృతమహోత్సవాలు జరుపుకుంటున్న రోజుల్లో కూడా దళితులు అణచివేతకు గురవుతూ, పేదరికంలో మగ్గుతున్నారని మన నాయకులు చెప్తున్నారని అన్నారు. దుఃఖం, వివక్ష అనుభవించిన వారు కాబట్టే అంబేద్కర్ (Ambedkar) గొప్ప రాజ్యాంగం అందించారని గుర్తు చేశారు.

eatala-rajender-fire-on-telangana-cm-kcr

అంబేద్కర్ రాజ్యాంగం 75 సంవత్సరాలు అయినా సంపూర్ణంగా అమలు కాలేదన్న ఈటల.. పొలిటికల్ లీడర్ కావాలంటే రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని అమలు చేయాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవి కొనుక్కుంటే, అడుక్కుంటే వచ్చేది కాదని… రాజ్యాంగ బద్దంగా ప్రజల ఓటుతో వచ్చేదన్నారు. గుడిసెల్లో ఉన్నవారికి అయినా, లక్షల కోట్లు ఉన్న వారికి అయినా అంబేద్కర్ ఒక్క ఓటు మాత్రమే అందించారని తెలిపారు. తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని తెలిపారు. రాష్ట్రం వచ్చాక కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. దళిత ముఖ్యమంత్రి హామీపై మోసగించారని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినట్టే ఇచ్చి అవమానకరంగా తీసివేశారన్నారు.

‘‘52 శాతం బీసీలు ఉంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు. అవి కూడా సంక్షేమ శాఖలు తప్ప రెవెన్యూ, ఫైనాన్స్, ఇండస్ట్రీ లాంటి శాఖలు ఇవ్వలేదు. నాలాంటి వాన్ని బయటికి పంపి ఖాళీ అయిన మంత్రి పదవి కూడా మనకు ఇవ్వలేదు. అంటే మన కులాల పట్ల కేసీఆర్ వైఖరి ఏంటో అర్థం చేసుకోండి. 17 శాతం ఉన్న దళితులకు ఒక్కటే మంత్రి పదవి ఇచ్చారు. 0.6 శాతం ఉన్న జనాభాకు మాత్రం నాలుగు పదవులు ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి కేసీఆర్ గురించి చెప్పడానికి. అలాంటప్పుడు కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలి? ప్రతి దళితుడు ఆలోచన చెయ్యాలి. మూడు ఎకరాల భూమి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు. మనం గొంతెమ్మ కోరికలు కోరలేదు. మనిఫెస్టో చూసి ఓటు వేశాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీసే అధికారం అంబేద్కర్ మనకు ఇచ్చారు’’ అని అన్నారు ఈటల రాజేందర్.

దళితులు బీజేపీ వైపు లేరు అనే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క పిలుపు ఇస్తే ఇంతమంది వచ్చారని.. రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. కేసీఆర్ దళిత జాతి మీద ఉన్న ప్రేమతో హుజూరాబాద్ లో దళితబంధు పేరుతో పది లక్షలు ఇవ్వలేదన్నారు. 47 వేల ఓట్ల మీద ఉన్న ప్రేమతోనే అమలు చేశారని విమర్శించారు. లక్షా 70వేల జీతం తీసుకొనే ఉద్యోగికి కూడా హుజూరాబాద్ లో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నియోజకవర్గానికి ఒక్క వెయ్యి మందికి కూడా పది లక్షలు ఇవ్వలేదని.. అలాంటి కేసీఆర్ కు ఓటెందుకు వేయాలని నిలదీశారు.

మద్యం ద్వారా తెలంగాణ వచ్చినప్పుడు 10,700 కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 45 వేల కోట్లకు చేరిందన్నారు ఈటల. కలెక్టర్లు.. లిక్కర్ ఎందుకు అమ్ముడు పోవడం లేదో సమీక్ష చేస్తున్నారని.. అర్ధరాత్రి పూట నొప్పులొస్తే మెడిసిన్ దొరకదు కానీ.. మద్యం సీసా మాత్రం రాష్ట్రంలో దొరుకుతోందని విమర్శించారు. పాజిటివ్ ఆదాయం ఉండాలి కానీ, ఇలా మద్యం మీద కాదన్నారు. ‘‘అన్నిట్లో నెంబర్ వన్ అని కేసీఆర్ చెప్తారు.. దేంట్లో నెంబర్ వన్. తాగుడు ఆదాయంలో నెంబర్ వన్. హామీలు ఇచ్చి అమలు చేకపోవడంలో.. అణగారిన వర్గాలకు అధికారం లేకుండా బానిసలు చెయ్యడంలో.. కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకోవడంలో నెంబర్ వన్ అంటూ విరుచుకుపడ్డారు.

రైతుబంధు పేరుతో భూస్వాములకు డబ్బులు ఇస్తున్నారు తప్ప.. చచ్చిపోతే దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని వారికి ఒక్క రూపాయి ఇవ్వడం లేదన్నారు రాజేందర్. 2014లో 10 లక్షల డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తా అని అన్నారు.. 2.91 లక్షల ఇళ్లకు మంజూరు చేసి.. 1.30 లక్షలు ఇల్లు కట్టారు.. కానీ, 35 వేలు మాత్రమే పంచారని విమర్శలు చేశారు. అదే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 3.5 కోట్ల ఇళ్లు కట్టించారని వివరించారు. కేంద్ర నిధులతో 20 లక్షల ఇళ్లు పక్క రాష్ట్రంలో కట్టారని.. కానీ ఇక్కడ మాత్రం తీసుకోలేదని విమర్శించారు. సొంత మనుషులకు ఉద్యోగాలు ఇప్పిచుకోవడానికి పేపర్ లీకులు చేశారని ఆరోపించారు. ‘‘తెలంగాణ యువత కన్నీరు పెడుతోంది. అటుకులు బుక్కి పార్టీ నడిపినా అంటారు కదా.. 900 కోట్లు పార్టీ అకౌంట్ లోకి వైట్ మనీ ఎలా వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం తప్ప మరొకరికి సీఎం పదవి రాదు. హుజూరాబాద్ లో ఆత్మగౌరవం ఎలా నిలబెట్టారో తెలంగాణ అంతా నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చైతన్యాన్ని రగిలించండి.. ఐక్యంగా ఉండండి.. మనకు ప్రజల ఆశీర్వాదం ఉంటుంది’’ అని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు ఈటల రాజేందర్.

You may also like

Leave a Comment