దేశవ్యాప్తంగా రెండో విడత పార్లమెంట్ ఎన్నికలు(Parliament Elections) ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే.అయితే, ఒక్క మణిపూర్(Manipur) రాష్ట్రంలో మాత్రం కొన్ని చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ బూతుల వద్ద అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోవడంతో ఆయా బూతుల వద్ద రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదివరకు జరిగిన పోలింగ్‌ను రద్దు(Polling Cancel) చేస్తున్నట్లు ప్రకటించింది. రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మణిపూర్‌లోని 6 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. అయితే, ఆయా పోలింగ్ కేంద్రాల్లో గుర్తుతెలియని కొందరు దుండగులు ఈవీఎంలు పగలగొట్టినట్లు సమాచారం. దీనికి తోడు పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
అదేవిధంగా రిగ్గింగ్ కూడా జరిగిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ ఘటనపై మణిపూర్ కాంగ్రెస్ యూనిట్ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది.
దీంతో ఈనెల 30న ఉదయం గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరోసారి పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2),58A (2) ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్లోని షాంగ్ షాక్ ఎ, ఉఖ్రుల్ (ఎ), ఉఖ్రుల్ (D-1), ఉఖ్రుల్ (F), చింగై, ఓయినం (A1) బూతుల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ప్రదీప్ కుమార్ ఝా తెలిపారు. ఓటింగ్ కోసం ఓటర్లు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా, ఔటర్ మణిపూర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 సెగ్మెంట్లలోని 848 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.