ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అరెస్టు చట్టపూర్వంకంగానే జరిగిందని, ఈడీ (ED) ఎక్కడా నిబంధనల ఉల్లంఘనకు (Rules Break) పాల్పడలేదని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. అరెస్టు టైంలో పీఎంఎల్ ఏలోని సెక్షన్ 19ను ఈడీ ఫాలో అయ్యిందని జడ్జి ఎంకే నాగ్‌పాల్ స్పష్టంచేశారు.
అంతకుముందు తన అరెస్టు టైంలో పీఎంఎల్ ఏ చట్టంలోని సెక్షన్-19ను ఈడీ పాటించలేదని కవిత తరఫు లాయర్ చేసిన వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. తమకు ఫేవర్‌గా ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించినందుకు గాను రూ.100 కోట్ల మేర లంచాలను ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇచ్చిన సౌత్ గ్రూపులో కవిత భాగస్వామిగా ఉన్నారని జడ్జి నాగ్‌పాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో సహ నిందితులుగా ఉండి అప్రూవర్ గా మారిన పి.శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, దినేశ్ అరోడా, సహ నిందితులు సమీర్ మహేంద్రు, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీ.శ్రీనివాసరావు, గోపీ కుమరన్ లు ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అద్దం పడుతున్నాయని న్యాయమూర్తి తన తీర్పులో స్ఫష్టంచేశారు.
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని, ఆమె ఈడీ విచారణకు హాజరుకాకుండా దర్యాప్తును స్థంభింపజేసినట్లు కనిపిస్తోందని, ఆమె నేరపూరిత ఆదాయంలోని ప్రధాన భాగాన్ని వెలికితీయడానికి కవితను విచారించాల్సిన అవసరం ఉందని జడ్జి నొక్కి చెప్పారు. కవిత అరెస్టు విషయంలో ఈడీ రూల్స్ ను ఫాలో అయ్యిందని మరోసారి స్పష్టంచేశారు. కాగా, తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో ఈనెల 18న వేసిన రిట్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.