ఢిల్లీలో ఈడీ దాడులు (ED Raids) కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ (Raj Kumar) ఆనంద్ నివాసంలో ఈడీ ఈ రోజు ఉదయం నుంచి దాడులు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి రాజ్ కుమార్ నివాసంతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ ఈడీ దాడులు చేస్తోంది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈ దాడులు చేస్తున్నారా అనే విషయాన్ని మాత్రం ఈడీ వర్గాలు ఇప్పటి వరకు వెళ్లడించకపోవడం గమనార్హం.
కేజ్రీవాల్ కేబినెట్‌లో రాజ్ కుమార్ ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల రాజీనామాల తర్వాత వారి వద్ద ఉన్న విద్యాశాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆయనకు అప్పగించారు. అనంతరం సౌరవ్ భరద్వాజ్ కు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అతిషికి విద్యాశాఖలను బదిలీ చేశారు.
ఇది ఇలా వుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరవుతారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కేజ్రీవాల్ ను ఈ రోజు ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.