ఢిల్లీ (Delhi) ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (Amanathulla Khan) నివాసంలో ఈడీ (Enforcement Directorate) దాడులు చేస్తోంది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయనతో పాటు ఆయన సన్నిహతుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారంటూ అమానతుల్లా ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ, సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లను ఆధారంగా చేసుకుని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు తాజాగా ఈడీ దాడులు చేస్తోంది. ఢిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా వున్నారు. దీంతో పాటు ఆయన ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా వున్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు మొదలు పెట్టింది. అనంతరం గతేడాది సెప్టెంబర్ లో ఆయన్ని ఏసీబీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ ఎంటర్ అయింది. ఢిల్లీలోని జామియా నగర్‌లోని అమానతుల్లా ఖాన్ నివాసంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో దాడులు చేస్తోంది.
గతేడాది అమానతుల్లా ఖాన్ నివాసంలో ఏసీబీ దాడులు చేసింది. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు చేసింది. ఇది ఇలా వుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ పేర్కొంది. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో దాడులు జరగడం కలకలం రేపుతోంది.