Telugu News » ED Raids: సీఎం కుమారుడు, పీసీసీ చీఫ్ టార్గెట్… కలకలం రేపిన ఈడీ దాడులు…!

ED Raids: సీఎం కుమారుడు, పీసీసీ చీఫ్ టార్గెట్… కలకలం రేపిన ఈడీ దాడులు…!

దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శలు చేసిన కొద్ది రోజులకే ఈ దాడులు జరగటం గమనార్హం.

by Ramu

అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ (Rajasthan)లో ఈడీ (ED) దాడులు కలకలం రేపుతున్నాయి. ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్​ గోవింద్‌ సింగ్‌తోపాటు, మరి కొందరు నేతల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పేపర్ లీకేజీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శలు చేసిన కొద్ది రోజులకే ఈ దాడులు జరగటం గమనార్హం.

 

మరోవైపు సీఎం అశోక్​ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. పేపర్ లీకేజీలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి.. గతంలో రాజస్థాన్‌ విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన గోవింద్‌ సింగ్‌కు చెందిన శికర్‌, జయపుర ప్రాంతంలోని నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో పాటు మహువాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓం ప్రకాశ్‌ హుడ్లాతో పాటు పలువురు నేతల నివాసాల్లో తనిఖీలు చేసింది.

ఇక మరోవైపు సీఎం అశోక్‌ గెహ్లాట్ వైభవ్‌కు ఈడీ సమన్లు పంపింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల మేరకు ఆయనకు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈడీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

తాజా పరిణామాలపై సీఎం అశోక్‌ గెహ్లాట్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ నెల 25న రాష్ట్రంలో మహిళల కోసం కాంగ్రెస్‌ హామీలను ప్రకటించిందని చెప్పారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌పై ఈడీ దాడులకు చేసిందన్నారు. తన కుమారుడు వైభవ్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల ప్రయోజనాలు అందాలని బీజేపీ కోరుకోవడం లేదని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఈడీ తనిఖీలు జరుగుతాయన్నారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్​ భయపడదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తామన్నారు. రాజస్థాన్​లో తన ప్రభుత్వాన్ని పడగొట్టలేక వివిధ మార్గాల్లో తమను టార్గెట్​ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మరోవైపు రాజస్థాన్​ పీసీసీ చీఫ్​ ఇంట్లో ఈడీ సోదాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికలు సమీపస్తున్న వేళ బీజేపీకి ఈడీ, సీబీఐ నిజమైన ‘పేజ్​ ప్రముఖ్​’గా మారాయని ఆరోపణలు గుప్పించారు. రాజస్థాన్​లో ఓటమిని ముందే ఊహించి బీజేపీ ఈ మేరకు ఎత్తుగడ వేసిందన్నారు.

You may also like

Leave a Comment