భారత ఎన్నికల సంఘం (Election Comission OF India) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) పై నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 7 ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో వుంటాయని ఈసీ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారికి చట్ట ప్రకారం రెండేండ్ల జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మొదట మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్లో, నవంబర్ 25న రాజస్థాన్లో , నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఛత్తీస్ గఢ్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత ఎన్నికలను నవంబర్ 7న నిర్వహించనున్నారు.
నవంబర్ 17న రెండో దశ పోలింగ్ ను నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇక ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.