ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్ (Schedule) ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) రెడీ అవుతోంది. తెలంగాణ (Telangana) తో పాటు మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది.
ఈ మేరకు భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ (Rajiv Kumar) మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని నిర్వచన్ సదన్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ తో కలిసి ఆయన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణలో డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలతో కలిసి తెలంగాణ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 10న ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక చత్తీస్ గఢ్ లో మాత్రం రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 17తో మిజోరాం అసెంబ్లీ గడువు ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.