తెలంగాణ(Telangana)లో తొలిసారిగా ఏనుగు బీభత్సం సృష్టించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District)లో బుధవారం చింతలమానెపల్లి(Chinthalamanepalli) మండలంలో ఓ రైతుపై దాడి చేసి చంపగా గురువారం తెల్లవారుజామున పెంచికల్‌పేటలో మరో రైతు ప్రాణాలు తీసింది. ఈఘటనతో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. దీనిలో నుంచి ఒకటి విడిపోయి అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత నుంచి జిల్లాలోకి ప్రవేశించినట్లు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ క్రమంలోనే గజరాజు ఇద్దరు రైతులను బలి తీసుకోవటం కలకలం రేపింది.
బూరేపల్లి గ్రామ శివారులో మిర్చి తోటలోకి ఏనుగు ప్రవేశించింది. పొలంలో తోట పని చేస్తున్న అన్నూరి శంకర్ అనే రైతుపై ఒక్కసారిగా గజరాజు విరుచుకుపడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఏనుగు కోసం గాలిస్తున్న తరుణంలోనే తెల్లవారుజామున పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో రైతు తారు పోషన్నపై దాడి చేయడంతో మృతిచెందాడు.
తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన పోషన్న ఉదయం విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో అడుగుల గుర్తులు, మృతుడి శరీరంపై ఉన్న గాయాలను గమనించి ఏనుగు పనేనని నిర్ధారించుకున్నారు. దాడి చేసిన గజరాజు మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నదిని దాటి జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కుమురం భీం జిల్లాలో ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే గుంపులుగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. గజరాజు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.