ప్రధాని మోడీ (PM Modi)పై అమెరికా నటి, సింగర్ మేరీ మిల్బెన్ (Meri Milben) ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ గొప్ప నాయకుడన ఆమె కితాబిచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ నిలబడతారని ఆమె తెలిపారు. భారత్‌ను, దేశ పౌరులను అభివృద్ధి పథంలో నడిపే గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అంటూ ఆమె కొనియాడారు. జనాభా నియంత్రణపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆమె మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల పర్వం నడుస్తోందన్నారు. దేశంలో కాలం చెల్లిన విధానాల్లో మార్పులు తీసుకు వచ్చేందుకు, వాటికి ముగింపు పలికేందుకు ఎన్నికలు ఒక్క గొప్ప అవకాశం అన్నారు. ప్రగతి వ్యతిరేక శక్తులకు చెక్ పెట్టి వారి స్థానంలో ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, దేశ పురోగతి కోసం పని చేసే నాయకులను ఎన్నుకునేందుకు ఇది అద్భుతమైన సమయం అని చెప్పారు.
భారత రాజకీయాలను మీరు ఎందుకంత ఆసక్తిగా ఫాలో అవుతారని, ప్రధాని మోడీకి మీరు ఎందుకు మద్దతు ఇస్తారని ప్రతి సారి తనను చాలా మంది అడుగుతారని వెల్లడించారు. దానికి సమాధానం…. తనకు భారత్ అంటే చాలా ఇష్టమన్నారు. భారత్ కు, ఆ దేశ పౌరుల పురోగతికి కృషి చేసే అత్యుత్తమ నాయకుడు ప్రధాని మోడీ అని తాను నమ్ముతున్నట్టు వివరించారు.
అమెరికా-ఇండియాల మధ్య సంబంధాల బలోపేతానికి, ప్రపంచ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి పని చేస్తున్న గొప్ప నాయకుడన్నారు. జనాభా నియంత్రణపై నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. బిహార్ లోని ధైర్వవంతులైన మహిళలు ముందుకు వచ్చి సీఎం స్థానం కోసం బరిలో నిలవాలన్నారు. బిహార్‌లో మహిళా సాధికారత కోసం వారికి బీజేపీ మద్దతు ఇవ్వాలని కోరారు.