తెలంగాణ సరిహద్దులో మళ్లీ తూటా పేలింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా(Mulugu District) కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు నక్సల్స్ ఎదురుపడ్డారు. దీంతో వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఏకే-47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు లభించాయని వెల్లడించారు.
ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత ఈనెల 1న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి-లేంద్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కదలికలకు సంబంధించి సమాచారం అందడంతో బీజాపూర్ డీఆర్జీ, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, కోబ్బ్రా బృందాలు సంయుక్తంగా కూబింగ్ నిర్వహించి కాల్పులు జరిపాయి.
పోలీస్ బృందాలకు మావోయిస్టులకు మధ్య సుమారు ఎనిమిది గంటల పాటు ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం ముగ్గురు మహిళలతో సహా 13మంది మావోయిస్టుల మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. ఘటనాస్థలం నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, ఒక ఏకే 47, ఎల్ఎంజీ ఆయుధం, 303 బోర్ రైఫిల్, 12 బోర్ రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, భారీ పరిమాణంలో బీజీఎల్ షెల్స్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులును స్వాధీనం చేసుకున్నారు.