పార్లమెంట్‌లో స్మోక్ అటాక్ కేసులో అరెస్టైన నిందితుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులంతా 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గల వారే కావడం గమనార్హం. నిందితులంతా వేరు వేర ప్రాంతాలకు చెందిన వారు. కాగా నిందితులంతా భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ సభ్యులని తెలుస్తోంది.
నీలమ్ ఆజాద్, అమోల్ షిండేలు తమకు ఆశించిన ఉద్యోగాలను పొందలేకపోయారు. ఈ క్రమంలో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింస ఘటనలను హైలెట్ చేసేందుకు ఈ దాడి చేసినట్టు నిందితులు చెబుతున్నారు. నిందితుల విద్యార్హతలు కూడా ఒక్కొ రకంగా ఉన్నాయి.
లోక్ సభలోకి నిన్న ఇద్దరు నిందితులు దూసుకు వెళ్లారు. వారిలో మొదట దూకిన వ్యక్తిని సాగర్ శర్మగా పోలీసులు గుర్తించారు. సాగర్ ఈ-రిక్షా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. స్పీకర్ చైర్ దిశగా దూసుకు వెళ్లిన సాగర్ ను ఎంపీలు అడ్డుకున్నారు. అనంతరం సాగర్ కు దేహశుద్ది చేసి భద్రతా సిబ్బందికి అప్పగించారు. సోషల్ మీడియాలో సాగర్ తరుచుగా భగత్ సింగ్, చెగువెరా పోస్టులు పెడుతూ ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
మరో నిందితుడు మనోరంజన్ స్వస్థలం మైసూరు. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి పాసులను మనోరంజన్ సంపాదించాడు. దీంతో విజిటర్స్ గ్యాలరీలోకి వెళ్లేందుకు ఆయనకు అవకాశం దొరికింది. గ్రాడ్యుయేషన్ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడని ఆయన తండ్రి చెబుతున్నారు. తన కుమారుడు అలా చేసి ఉండడని తండ్రి దేవరాజ్ గౌడ తెలిపారు.
నీలమ్ ఆజాద్ స్వస్థలం హర్యానాలోని హిస్సార్. ఎంఫిల్ డిగ్రీ చేసిన ఆమె నెట్ కు కూడా అర్హత సాధించారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. పార్లమెంట్ ఆవరణలో మరో వ్యక్తితో కలిసి రంగలు క్యాన్లతో నిరసనకు దిగారు. దీంతో ఆమెను పోలీసులు పట్టుకున్నారు.
ఇక అమోల్ షిండే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ స్మోక్ క్యాన్లను మహారాష్ట్ర నుంచి అమోల్ తీసుకు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 25 ఏండ్ల అమోల్ పలు మార్లు పోలీసు, ఆర్మీ పరీక్షలకు హాజరై విఫలం అయ్యాడు. దీంతో ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈ క్రమంలో తాజాగా పోలీసు రిక్రూట్ మెంట్ డ్రైవ్ కోసం వెళ్తున్నానంటూ చెప్పి అక్కడి ఢిల్లీకి వచ్చాడు.