బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాన కొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో తాను స్థానికంగా కొనసాగే పరిస్థితులు లేవన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో వెల్లడించారు.
2019 నుంచి బీఆర్ఎస్ లో తాను పని చేస్తున్నానని అన్నారు. అప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం పని చేశానని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతుందని తాను భావించానన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని అనుకున్నానన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడుస్తున్నా అమర వీరుల ఆశయాలు నెరవేరలేదని చెప్పారు.
ఇప్పటికీ అమర వీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ఇప్పటి వరకు అధిష్టానం తనకు అప్పగించిన ప్రతి పనిని విధేయతతో నిర్వహించానన్నారు. తనకు సహాయ సహకారాలు అందించిన పార్టీ అధిష్టానానికి, పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి మానకొండూరు ఎమ్మెల్యే టికెట్ ను ఆయన ఆశించారు. కానీ టికెట్ విషయంలో అధిష్టానం రసమయి వైపే మొగ్గు చూపింది. ఎమ్మెల్యే టికెట్ ను రసమయికే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో గత కొంత కాలంగా అసంతృప్తితోనే ఆయన పార్టీలో కొనసాగారు. ఈ క్రమంలో తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.