నకిలీ పాస్ పోర్టు(Fake Passport)లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. తెలంగాణ సీఐడీ(Telangana CID) అధికారులు హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాలలో శనివారం సోదాలు చేశారు. ఈ ముఠాకు సహకరించిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అరెస్టు చేశారు.
ఈ ముఠాలో హైదరాబాద్ నాంపల్లికి చెందిన అబ్బుస్ సత్తార్‌ను ప్రధాన సూత్రధారిగా తేల్చారు. సత్తార్‌తో పాటు 9 మంది గల్ఫ్ ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011 నుంచి సత్తార్ నకిలీ పత్రాల దందా చేస్తున్నాడు. నకిలీ బర్త్ సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు తయారుచేసి అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు.
చెన్నైకి చెందిన ఒక బ్రోకర్ పరిచయం కావడంతో సత్తార్ విదేశీయులకు, శరణార్థులకు నకిలీ ఐడి ప్రూఫ్‌లు తయారుచేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.75వేలు తీసుకొని ఇచ్చేవాడు. నకిలీ ఐడి ప్రూఫ్‌లు తయారు చేసిన తర్వాత పాస్ పోర్ట్ స్లాట్లు సత్తార్ బుక్ చేసేవాడు. పాస్ పోర్ట్ ఆఫీస్‌లో విచారణ సమయంలో చెన్నైకు చెందిన బ్రోకర్ నకిలీ భారతీయులను పాస్ పోర్ట్ ఆఫీస్‌కి పంపించేవాడు.
పాస్ పోర్ట్ జారీకి ముందు జరిగే స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణను సత్తార్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేవాడు. ఈ ముఠా ఇప్పటి వరకు మొత్తం 92 మందికి నకిలీ పాస్పోర్ఠులు ఇప్పించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. కాగా ఈ ముఠా నుంచి నకిలీ పాస్‌పోర్టులు, కంప్యూటర్లు, పెన్ డ్రైవ్‌లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న నిందితులను సీఐడీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.