ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్ హర్డోయ్ (Hardoi) జిల్లా ఖమరియా గ్రామంలో బిల్హౌర్-కత్రా హైవే (Bilhaur-Katra Highway)పై ఈ దారుణం చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు గ్యాస్ కట్టర్లు వినియోగించినట్లు పేర్కొన్నారు. కాగా బాధితులు బరాకాంత్ గ్రామానికి చెందిన వారని, వీరు బరాకాంత్ నుంచి నయాగావ్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు..
కాగా కారు ప్రమాదంలో మరణించిన వారిలో నాలుగేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు తెలిపారు. మరోవైపు గుజరాత్ లో పోలీసులు వెళ్తున్న వాహనం బోల్తా పడి 38 మంది గాయపడ్డారు. గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు చూస్తే..
స్టేట్ రిజర్వ్ పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన అధికారులు.. వాహనం బ్రేక్లు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు..