వరుస అగ్నిప్రమాదాలు (Fire Accidents) భయపెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒకచోట మంటలు చెలరేగి విషాదాన్ని మిగుల్చుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi) పితంపురా ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమయ్యారు.
భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో భవనంలో రెండు కుటుంబాల సభ్యులు ఉన్నారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది.. స్థానిక పోలీసుల సహాయంతో ఏడుగురిని రక్షించారు. వారిని బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. 8 ఫైర్ ఇంజిన్లు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. పైన ఉన్న మూడు ఫ్లోర్లను పొగ కమ్మేసిందని వివరించారు.
షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఏరియా ఉందని, మిగిలిన ఫ్లోర్లలో జనాలు నివసిస్తున్నారని చెప్పారు పోలీసులు. మరోవైపు, ఠాణె లో ఓ కంటైనర్ ప్రమాదానికి గురైంది. బోల్తా పడ్డాక మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు.