దర్బంగా రైలు ఘటన మరువక ముందే యూపీ (UP)లోని ఇటావా(Etawah)లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ-సహస్ర వైశాలి సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్లో గురువారం మంటలు చెలరేగాయి. గడిచిన 10 గంటల్లో ఇటావాలో ఇది రెండవ ఘటన కావడం గమనార్హం. ఎస్-6 బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 19 మందికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. వారిలో 11 మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి బిహార్ లోని సహస్రకు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 2 గంటల ప్రాంతంలొ ఎస్ 6 బోగీ నుంచి మంటలు రావడాన్ని ప్రయాణీకులు గమనించారు.
వెంటనే రైల్వే సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో మెయిన్ పురి జంక్షన్ లో రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం మంటల్లో కాలిపోయిన బోగీని రైలు నుంచి తొలగించారు.
ఆ తర్వాత ఉదయం 6 గంటలకు మళ్లీ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆగ్రా ఎస్పీ ఆదిత్య లంగేష్ వెల్లడించారు. క్షతగాత్రులను సైఫై మెడికల్ కాలేజీకి తరలించినట్టు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.