ఇజ్రాయెల్ (Israel) లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత్ ఆపరేషన్ ‘అజయ్’ (Operation Ajay) ను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ అజయ్ మొదలు పెడుతున్నట్టు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్‌లో సుమారు 18000 మంది ఉన్నట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ నుంచి భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన ఛార్టెడ్ విమానాలను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ, సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ రోజు ప్రత్యేక విమానంలో భారత్ చేరుకుంటుందని అధికారలు తెలిపారు.
ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో భారత్ చేరుకునేందుకు రిజిస్టర్ చేసుకున్న భారతీయుల జాబితాను ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వారికి ఈమెయిల్ చేసింది. తర్వాత బ్యాచ్ ల్లో ప్రయాణించే ప్రయాణికుల జాబితా, విమానాల వివరాలను ఇజ్రాయెల్ లోని భారతీయుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు పంపించనున్నట్టు రాయబార కార్యాలయం పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో యుద్దం జరగుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి భారతీయులకు సహాయం చేసేందుకు టెల్ అవీవ్ తో పాటు రమల్లాహ్ ప్రాంతంలో ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అజయ్ విషయంలో భారత్ కు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని ముంబైలో ఇజ్రాయెల్ కాన్స్యులేట్ కొబ్బి షోషానీ తెలిపారు.