ఉత్తరాఖండ్ టన్నెల్ (Tunnel)లో నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation )లో కీలక పురోగతి కనిపించింది. ఎట్టకేలకు కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా సొరంగంలో చిక్కుకు పోయిన 41 మంది కార్మికులు కెమెరా కంటికి చిక్కారు. తాజా పురోగతితో రెస్క్యూ సిబ్బందికి కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. కార్మికులకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిల్క్యారా టన్నెల్‌లోకి నిన్న ఆరు అంగులాల వెడల్పు గల ఓ పైపును రెస్క్యూ సిబ్బంది పంపించారు. ఈ పైపు లైన్ ద్వారా కార్మికులకు నిన్న గ్లాస్ సీసాల్లో కిచిడీ పంపించారు. ఈ రోజు ఉదయం వారికి అల్పాహారం కూడా పంపించారు. అంతకు ముందు కేవలం నాలుగు అంగుళాల పైపు మాత్రమే ఉండేది. దీంతో దాని గుండా డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించే వీలు ఉండేది.
ఇది ఇలా వుంటే ఈ పైపు లైన్ ద్వారా తాజాగా ఓ ఎండోస్కోపిక్ కెమెరాను సొరంగంలోకి పంపించారు. టన్నెల్ లోకి పైపు ద్వారా ఆహార పదార్థాలను పంపించగా కార్మికులు దాన్ని తీసుకుంటుండగా కెమెరాతో ఫోటోలు తీశారు. అందులో కార్మికులు పసుపు, తెలుపు రంగు హెల్మెట్‌లు ధరించి ఆహార పదార్థాలు తింటూ కనిపించారు. దీంతో భారీ పురోగతి లభించిందని అధికారులు తెలిపారు.
ఇది ఒక గొప్ప విజయమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కార్మికులు రెస్క్యూ సిబ్బంది గొంతును స్పష్టంగా వినగలుగుతున్నారని, రెస్సాండ్ అవుతున్నారని అంటున్నారు. త్వరలోనే టన్నెల్ లోకి మొబైల్ ఫోన్లు కూడా పంపిస్తామన్నారు. గత కొన్ని రోజులుగా కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటుండటంతో కార్మికులు కాస్త నీరసంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కార్మికులంతా సురక్షితంగా ఉండటంతో కార్మికుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.