పొంగమంచు(Fog) నిండు ప్రాణాలను బలిగొంటోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు కారణంగా విమానాలను దారి మళ్లించారు. మరోవైపు రోడ్డు మార్గాల్లో పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్(UP)లోని బరేలీ(Bareilly)లో ఓ ట్రక్కు ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై దట్టంగా పొగమంచు ఏర్పడింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న బస్సును పలు కార్లు ఢీకొన్నాయి. ఆగ్రా(Agra)లో మరో రెండు ట్రక్కులు ఢీకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. అదేవిధంగా తెలంగాణలో పొగమంచు కమ్మేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొగ మంచు కారణంగా తెల్లవారినా సూర్యుడు కనిపించడంలేదు. ఉదయం తొమ్మిదిన్నర గంటలైనా చలి తగ్గకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
వాహనాలు నడిపేవారు పట్టపగలు లైట్లు వేసుకొని నడపాల్సి వస్తోంది. పొగమంచుతో రోడ్డు కనిపించక మహబూబ్ నగర్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ స్టేజ్ వద్ద రోడ్డు కిందకు దూసుకెళ్లింది. క్రేన్ సాయంతో బస్సును రోడ్డు మీదికి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో తెల్లవారుజామున మంచు కురిసింది.