దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ (Hyderabad) నిలిచింది. ఈ జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరవ సారి. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక-సాంస్కృతిక ఇలా పలు అంశాల ఆధారంగా మెర్సర్స్ (Mercers) అనే సంస్థ క్వాలిటీ ఆఫ్ లివింగ్ (సిటీ ర్యాంకింగ్) సర్వే- 2023 ను నిర్వహించింది.
ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రపంచంలో అత్యుత్త జీవన ప్రమాణాలతో కూడిన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దేశం నుంచి ఈ ఏడాది కూడా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఏడాది హైదరాబాద్ పది స్థానాలు దిగజారింది. 2019లో 143 స్థానంలో ఉన్న భాగ్యనగరం 2023లో 153వ స్థానానికి పడిపోయింది.
దేశంలో హైదరాబాద్ తర్వాత అత్యుత్తమ జీవన ప్రమాణ నగరంగా పూణే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే పూణే 154 స్థానంలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు 156వ స్థానంలో నిలిచింది. ఇక చెన్నై 161, ముంబై 164, కోల్‌కత్తా 170 స్థానాల్లో, దేశ రాజధాని ఢిల్లీ 172 స్థానానికే పరిమితమైంది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా టాప్‌లో నిలిచింది.
ఇక స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ రెండో స్థానం, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ సిటీ మూడవ స్థానంలో నిలిచాయి. అత్యంత దారుణమైన నగరాలుగా ఎన్ జమేనా (చాద్), బెంగుయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్), ఖర్టూమ్ (సూడాన్) ర్యాంకింగ్‌లో అట్టడుగున ఉన్నాయి. ఈ జాబితాలో వరుసగా ఆరవ సారి హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు.