కెనడా (Canada) తో దౌత్య పరమైన ( Diplamatic) ప్రతిష్టంభన (Stand Off) నేపథ్యంలో ప్రధాని మోడీ (PM Modi) తో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaya Shankar) భేటీ అయ్యారు. పార్లమెంట్ (Parliament) లో ప్రధానితో ఆయన భేటీ అయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల, ఖలిస్తాన్ వేర్పాటు వాదుల హెచ్చరికలు గురించి ప్రధాని మోడీకి జై. శంకర్ వివరించినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు భారత ప్రభుత్వానికి సంబంధాలు వున్నాయని కెనడా ఆరోపించింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హౌస్ ఆఫ కామన్స్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందన్నట్టు తమ సెక్యూరిటీ ఏజెన్సీలకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశంలో భారత రాయబారిని బహిష్కరిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలనీ జోలీ వెల్లడించారు. కెనడా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో వ్యాఖ్యలు అసంబద్ధమైనవని భారత్ కొట్టి పారేసింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలు విడ్డూరంగా వున్నాయని భారత్ పేర్కొంది.
మరోవైపు కెనడా చర్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వెంటనే భారత్ లోని కెనడా రాయబారిని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. కెనడా రాయబారిని బహిష్కరిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఐదు రోజుల్లో భారత్ విడిచి వెళ్లి పోవాలని హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.