భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ (Arindam Bagchi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు కెనడా (Canada) స్వర్గధామంగా మారుతోందని ఆయన ఆరోపించారు. ఖలిస్థానీ (Khalisthani) ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలకు సంబంధించి కెనడా ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలను బయటపెట్టలేదన్నారు.
ట్రూడో వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పారు. రాజకీయ కారణాలతోనే కెనడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆయన అన్నారు. ఇటీవల ఈ ఆరోపణల గురించి ప్రధాని మోడీ దృష్టికి కెనడా ప్రధాని తీసుకు వచ్చారని చెప్పారు. ఆ ఆరోపణలను ప్రధాని మోడీ తోసి పుచ్చినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఇస్తే పరిశీలించేందుకు భారత్ రెడీగా వుందన్నారు.
కెనడాలో కొంత మంది వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడుతున్నారన్నారు. వాటికి సంబంధించి సాక్ష్యాధారాలను తాము కెనడాకు ఎప్పటికప్పుడు అందిస్తూనే వున్నామన్నారు. కానీ కెనడా మాత్రం వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సుమారు 20 మంది వ్యక్తులను భారత్ కు అప్పగించాలని కెనడాను కోరామన్నారు.
కానీ కెనడా నుంచి ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదన్నారు. కెనడా నుంచి భారత విద్యార్థులను వెనక్కి పిలిపించే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతానికి వారిని అక్కడే జాగ్రత్తగా వుండాలని సూచించామన్నారు. ఇక కెనడాలో భారత రాయబార కార్యాలయానికి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. భద్రతా పరమైన కారణాల వల్లనే కెనడాలో వీసా దరఖాస్తు ప్రక్రియలను భారత హైకమిషన్లు, కాన్సులేట్లు పూర్తిచేయలేకపోతున్నాయని వివరించారు.
కెనడాలోని భారత దౌత్య సిబ్బందితో పోలిస్తే భారత్‌లో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా వుందన్నారు. ఇది సమానత్వ సూత్రానికి వ్యతిరేకంగా వుందన్నారు. ఆ సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరం కెనడాకు ఉందని సూచించారు. ఈ విషయంపై కూడా ఆ దేశాన్ని తాము అభ్యర్థించినట్టు వెల్లడించారు. అలాగే భారత అంతర్గత వ్యవహారాల్లోనూ కెనడా దౌత్యవేత్తలు తరచుగా జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.