షహీద్ కుయిలీ (Shaheed Kuyili)….బ్రిటీష్ (British) పాలకులను ఎదురించిన ధీర మహిళ. బ్రిటీష్ చెర నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన వీరనారీమణి. ఆంగ్లేయుల కోటలో చొరబటి వారి ఆయుధాగారాన్ని పేల్చి వేసిన అపర కాళిక ఆమె. రాజ్యం కోసం సూసైడ్ బాంబర్ గా మారి చరిత్రలో నిలిచిన అత్యంత గొప్ప మహిళ కుయిలీ…
శివ గంగ రాజ్యానికి చెందిన రాజా ముత్తువడుంగంత పెరియా ఒడ్డయ తేవర్ మరణాంతరం ఆ రాజ్యాన్ని ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మళ్లీ తమ రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలని తేవర్ భార్య రాణి వేలు నాచియార్ పంతం పట్టారు. దీని కోసం షహీద్ కుయిలీ నేతృత్వంలో ఓ సైన్యాన్ని తయారు చేసి బ్రిటీష్ వారితో యుద్దానికి దిగారు.
బ్రిటీష్ వారితో ఎన్నో యుద్దాలు చేసినా శివ గంగ రాజ్యాన్ని రాణి వేలు నాచియార్ దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలో షాహీద్ కుయిలి తన మెదడుకు పదును పెట్టారు. ముందుగా శివగంగ కోటలోని ఆయుధగారంపై దాడి చేయాలని, ఆ దాడి నుంచి తేరుకునే లోపే బ్రిటీష్ సైన్యంపై మెరుపు దాడి చేసి రాజ్యాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేశారు.
అనుకున్నట్టుగానే షహీద్ కుయిలీ, కొంత మంది మహిళా సైనికులు మారు వేషంలో తమ ఆయుధాలను పువ్వుల బుట్టల్లో పెట్టుకుని కోటలోకి ప్రవేశించారు. కోటలోనికి ప్రవేశించిన తర్వాత షహీద్ కుయిలి తన ఒంటిపై నెయ్యి, నూనె పోసుకుని నిప్పు అంటించుకుంది. వెంటనే పరుగు పరుగున ఆయుధ గారంలోకి దూసుకు వెళ్లింది. దీంతో ఆయుధగారం మొత్తం పేలి పోయింది. వెంటనే రాణి వేలు నాచియార్ ఆర్కాట్ నవాబ్, బ్రిటీష్ సైన్యంపై దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నారు.