మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ (Congress)కి చూపెట్టింది కేవలం ట్రైలర్ మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ముందు ముందు ఆ పార్టీకి అసలు సినిమా ఉంటుందని తెలిపారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ…. పార్లమెంట్ ఎన్నికల కోసం అందరం కష్టపడి పని చేయాలని సూచించారు. కార్యకర్తలు చెప్పిన ప్రతి అంశాన్ని చర్చిస్తామని తెలిపారు. ఇంకో నెల అయితే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లోనే ఉంటారని చెప్పారు.
అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడుకునేందుకు లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా కార్యాలయాల్లోనూ లీగల్ సెల్ లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా అందరం కలిసి బస్ వేసుకుని మీ ముందుకు వస్తామని కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైన వారి పిల్లలకు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో వారిలో వారికే పడటం లేదంటూ విమర్శలు గుప్పించారు.