ప్రాజెక్ట్‌లను అప్పగించేది లేదని ప్రభుత్వం రంకెలేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కానీ ఇటీవల జరిగిన కేఆర్ఎంబీ (KRMB) మీటింగ్‌లోనే ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణకు దిగుతున్నారంటూ తీవ్ర స్తాయిలో విరుచుకపడ్డారు.
తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ…. సీఎం రేవంత్ రెడ్డి భాష, ధోరణి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ప్రాజెక్టులపై మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేవలం వితండవాదం చేశారే తప్ప మరేమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని వివరించారు.
ఆ సమావేశంలోనే ప్రాజెక్టులను అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోపణలు చేశారు. నెల రోజుల్లో 15 ఔట్ లెట్స్‌ను కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్‌లో కూడా ఉందని వెల్లడించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒకే చెప్పారని అన్నారు.
ఇక నుంచి ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరైనా డ్యామ్ పైకి వెళ్లాలంటే కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాల్స ఉంటుందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని తెలిపారు..కానీ కాంగ్రెస్ వచ్చిన కేవలం రెండు నెలల్లో రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను అప్పగించింది నిజం కాకపోతే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని నిలదీశారు.
తాను ప్రెస్ మీట్ పెట్టాక రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్‌లో తప్పులు ఉన్నాయని కేంద్రానికి లేఖ రాసిందని ఆరోపణలు గుప్పించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వాలు ఉండేది రాజకీయాల కోసం కాదని… ప్రజల కోసమన్నారు . ప్రభుత్వానికి భేషజాలు ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నారు.