బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పారిశుధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పారిశుధ్య కార్మికులతో కలిసి కేటీఆర్ లంచ్ చేశారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి పారిశుధ్య కార్మికులు ఫోటోలు దిగారు.
తాజాగా శానిటరీ కార్మికులతో కలిసి కేటీఆర్ లంచ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేశామని వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ పారిశుధ్య కార్మికులకు మూడు సార్లు వేతనాలు పెంచిందని తెలిపారు.
పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. సమస్యల గురించి మేయర్‌కు దృష్టికి తీసుకు వస్తే వాటిని ఆమె ప్రభుత్వానికి వివరించి సమస్యల పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్బంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కార్మికులు కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు.
ముఖ్యంగా తమకు ఉద్యోగ భద్రత లేదని కేటీఆర్ ఎదుట వాపోయారు. ముఖ్యంగా తమ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, కుటుంబ పోషణ భారంగా మారినట్టు కేటీఆర్ దగ్గర కార్మికులు ప్రస్తావించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా వుంటే కొత్త సంవత్స వేడుకల సందర్బంగా పలువురు నేతలు మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.