కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నాణేనికి బొమ్మా బొరుసుల్లాగా ప్రవర్తిస్తున్నాయని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీవి మాటలు మాత్రమే ఉన్నాయని అన్నారు. చేతలు మాత్రం కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు మతి భ్రమిమించిందని ఫైర్ అయ్యారు.
అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని మోడీ గురించి….. అధికారం కోల్పోయిన తర్వాత గవర్నర్ గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఖాళీ అవుతోందని… కేటీఆర్ నీకు ఆ విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులంతా రాజీనామా చేశారని అన్నారు. ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ కు దక్కే రాజ్యసభ సీటును తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మకు కేటాయించాలని సూచించారు. బీఆర్ఎస్ కు తెలంగాణ ఉద్యమకారులపై ప్రేమ ఉంటే ఆమెకు రాజ్య సీటు ఇవ్వాలన్నారు.
అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పేర్కొందన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరి ఇప్పటి వరకు ఎవరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో పదేళ్లలో జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్వేతపత్రం ఇచ్చి.. అసెంబ్లీలో ఎవరు దోషులో చెప్పడానికి మీకు దైర్యం ఉందా అని ప్రశ్నించారు.