పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ (Shah Mahmood Qureshi)కి కూడా కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది.
ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ అధికారిక రహస్యాలను బయటపెట్టారని ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఇమ్రాన్ ఖాన్‌కు స్పెషల్ కోర్టు జడ్జి అబుల్ హస్నత్ ముహమ్మద్ జుల్కర్నైన్ జైలు శిక్ష విధించారు. ఈ మేరకు విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది షోయబ్ షహీన్ వెల్లడించారు.
ఈ తీర్పుపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఒక పెద్ద తప్పుడు కేసు అని పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ పేర్కొంది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయబోతున్నట్టు పార్టీ వెల్లడించింది. ఇరువురు నేతలకు పాక్ మొత్తం అండగా ఉంటుందని ఆ పార్టీ ట్వీట్ చేసింది.
2022లో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగి పోయారు. ఆ సమయంలో ఓ బహిరంగ ర్యాలీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరిక కుట్రలు చేసిందని ఆరోపణలు చేశారు. అమెరికా ఆదేశాలకు ప్రకారం పాక్ లోని మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని సంచలన ఆోపణలు చేశారు. ఈ మేరకు కొన్ని పత్రాలను అధారంగా చూపించారు.
అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం నుంచి వాటిని సేకరించామని తెలిపారు. ఈ క్రమంలో అధికారిక దౌత్య సమాచారానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారని, దేశ రహస్య చట్టాలను ఇమ్రాన్, ఖురేషి ఉల్లంఘించారని పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదైంది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువురు నేతలకు జైలు శిక్ష విధించింది.