ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)తో జేడీఎస్ (JDS) అధినేత, మాజీ ప్రధాని దేవే గౌడ (HD Deve Gowda) భేటీ అయ్యారు. దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఎమ్మెల్యే హెచ్డీ ఎం. రేవణ్ణ, ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా ప్రధాని మోడీని కలిశారు.
దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ చేస్తున్న కృషిని ఈ సందర్బంగా దేవేగౌడ ప్రశంసించారు. దేవేగౌడతో భేటీ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో వెల్లడించారు. భేటీ తాలుకు ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. వారిని కలుసుకోవడం తనకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని తెలిపారు.
దేశ పురోగతికి దేవెగౌడ జీ అందించిన ఆదర్శప్రాయమైన సహకారాన్ని భారతదేశం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని అన్నారు. విభిన్న విధానపరమైన విషయాలపై ఆయన ఆలోచనలు అంతర్దృష్టి, భవిష్యత్తుకు సంబంధించినవి అని ప్రశంసించారు. ఇటీవల కర్ణాటకలో ఎన్నికల అనంతరం ఎన్డీఏ కూటమితో జేడీఎస్ పొత్తుపెట్టుకుంది.
రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు గురించి గత కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా చర్చలు చివరిదశకు చేరినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీతో జేడీఎస నేతలు భేటీ అయినట్టు తెలుస్తోంది.