ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ (Israel) నుంచి భారతీయులతో బయలుదేరిన నాల్గవ ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. మొత్తం 274 మంది భారతీయుులు ఈ విమానంలో భారత్ కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న ఇండియన్స్ కు కేంద్ర మంత్రి వీకే సింగ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారితో కేంద్ర మంత్రి వీకే సింగ్ కాసేపు ముచ్చటించారు. భారతీయులందరికీ త్రివర్ణ పతాకాలు అందజేశారు. ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు మరి కొన్ని విమానాలను పంపిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చామన్నారు.
మరిన్ని విమానాలను పంపించి భారతీయులను స్వదేశానికి తీసుకు వస్తామన్నారు. ఇజ్రాయెల్ లోని భారతీయులు ఆందోళన చెంద వద్దని ఆయన సూచించారు. ఎంబసీ అధికారుల సూచనలను ఫాలో కావాలని అక్కడి భారతీయులకు ఆయన సూచించారు. ఇజ్రాయెల్ కు సోమవారం మరో విమానాన్ని పంపించనున్నట్టు కేంద్రం మంత్రి పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌లో ఉన్న చివరి భారతీయున్ని స్వదేశానికి తీసుకు వచ్చే వరకు విమానాలను పంపిస్తామన్నారు. అప్పటి వరకు ఆపరేషన్ అజయ్ కొనసాగుతుందన్నారు. అందువల్ల ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు ప్రస్తుతానికి ఉన్న చోటనే ఉండాలని సూచించారు. ఇండియన్ ఎంబసీ వాళ్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటుందని వాటిని పాటించి భారత్ కు సురక్షితంగా చేరుకోవాలన్నారు.