వాసుదేవ్ బలవంత ఫడ్కే (Vasudev Balwant Phadke) ఓ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటికీ స్వరాజ్య సాధన ఒకటే మార్గమని భావించిన యోధుడు. కోలీలు, భిల్లులు, దంగారు తెగలను కూడగట్టి బ్రిటీష్ (British) వాళ్లకు వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేసిన దేశ భక్తుడు. భారతదేశంలో తీవ్రవాద జాతీయవాదానికి పితామహునిగా పేరు పొందిన వ్యక్తి ఆయన.
1876 -77 సంవత్సరంలో మహారాష్ట్రలో కరువు విలయ తాండవం చేసింది. వేలాది మంది కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని మరణించారు. ఎటు చూసినా దరిద్రం తాండవించింది. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన పాలకులు పన్నుల భారం వేసి సామాన్యులను మరింత ఇబ్బందులకు గురి చేశారు. ఓ వైపు కరువు, మరోవైపు పన్నులతో పేదవాడి పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
భారతీయులపై బ్రిటీష్ పాలకుల హింసాకాండను చూసి వాసుదేవ బలవంత ఫడ్కే ఆగ్రహంతో రగిలి పోయారు. తోటి భారతీయులంతా ఆకలితో అలమటిస్తుంటే తాను మాత్రమే ఆనందంగా బతకలేనని వెల్లడించారు. కోలీలు, బిల్లులు, దంగారులను కూడ గట్టి సైన్యాన్ని తయారు చేశాడు. వారందరి సహాయంతో ఆంగ్లేయులపై సమర శంఖం పూరించారు. తన పోరాటంతో ఆంగ్లేయులకు నిద్ర లేకుండా చేశారు.
ఫడ్కేను ఎలాగైనా పట్టుకోవాలని, ఉద్యమానికి ముగింపు పలకాలని బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అటు నిజాం ప్రభుత్వం, ఇటు బ్రిటీష్ ప్రభుత్వం ఫడ్కేను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫడ్కేను పట్టించిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. కొంత మంది ఆయన ఆచూకీని బ్రిటీష్ వారికి తెలిపారు. దీంతో ఫడ్కేను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేయగా జైలులో మరణించారు.