జీ-20లో మరో సభ్యదేశం చేరింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌కు(African Union) జీ-20 సభ్యత్వం లభించింది. జీ-20 సదస్సులో భాగంగా ఈ రోజు భారత మండపంలో వన్ ఎర్త్ సెషన్(Earth session) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సెషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వ విషయాన్ని ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనకు సభ్య దేశాలు ఓకే చెప్పడంతో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రధాని మోడీ అధికారికంగా వెల్లడించారు. సభ్య దేశాల మద్దతుతో ఆఫ్రికన్ నేషన్ ను సాదరంగా జీ-20లోకి ఆహ్వానిస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. దీంతో సభ్య దేశాలు చప్పట్లు కొట్టి జీ-20లోకి ఆహ్వానం పలికాయి.
అనంతరం ఆఫ్రికా యూనియన్ కు కేటాయించిన కుర్చీలో యూనియన్ ఆఫ్ కోమ్రోస్ అధ్యక్షుడు, ఆప్రికన్ యూనియన్ చైర్మన్ అజాలీ అసౌమనిని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూర్చో బెట్టారు. అనంతరం ప్రధాని మోడీ మొరాకో మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. మొరాకోకు ప్రపంచ దేశాలు అండగా వుండాలని సూచించారు.
ఆఫ్రికా యూనియన్ ను 2002లో ఏర్పాటు చేశారు. ఆఫ్రికా యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం కల్పించాలని సభ్య దేశాలకు ప్రధాని మోడీ ఈ ఏడాది జూన్ లో లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు యురోపియన్ యూనియన్ మద్దతు తెలిపింది. దీంతో పాటు చైనా, రష్యా, అల్బెట్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి.