– రక్షణ కల్పించండి..
– మీడియా ముందుకొచ్చిన భార్యాభర్తలు
– లక్ష్మీపూర్ గ్రామంలో భూ వివాదం
– రూ.4 కోట్ల ల్యాండ్ కు..
– రూ.30 లక్షలు ఇస్తామని బెదిరింపులు
ప్రజాప్రతినిధి అంటే.. ప్రజలను రక్షించేవాడు. కానీ, కొందరు నేతలు జనాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా ఆ కోవకే చెందుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ కుటుంబం మీడియా ముందుకొచ్చి మంత్రి నుంచి ప్రాణహాని ఉందని చెప్పడం సంచలనంగా మారింది.
వెంకటరమణ అనే వ్యక్తికి కళ్లు కనిపించవు. ఇతనికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. 2007లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయితీలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. ఇటీవల కుటుంబ అవసరాల కోసం 10 గుంటల భూమిని విక్రయించాడు. అయితే.. మిగిలిన భూమిని మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు కబ్జా చేశారని వెంకటరమణ అంటున్నాడు.
మంత్రి గంగుల ప్రోద్భలంతో మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలు తన భూమి కబ్జా చేశారని ఆరోపించాడు. న్యాయం చేయాలని మంత్రి వద్దకు వెళ్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని… వారికి భయపడి హైదరాబాద్ లో తలదాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వెంకటరమణ తన గోడును వెల్లబోసుకున్నాడు.
తన భూమిలో అక్రమ కట్టడాలు నిర్మించారని వాపోయాడు. రూ.4 కోట్ల విలువ చేసే తన భూమిలోకి వచ్చి ఇబ్బందులు కలిగిస్తుంటే 2021లో కోర్టులో కేసు వేశానన్నాడు. తన భూమిని వదులుకోవాలని రూ.30 లక్షల ఇస్తామని మంత్రి హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారు చెప్పినట్లు వినకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని వాపోయాడు.
ఈ విషయంపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. ఎస్సై ఎల్లయ్య గౌడ్ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడని ఆరోపించాడు. తన ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసిన భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపించాలని.. తక్షణమే తన భూమి ఇప్పించి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను వేడుకున్నాడు వెంకటరమణ.