ప్రధాని మోడీ (PM Modi) ఓ పాట రాశారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా ఆయన ‘మాడీ’ (Maadi )పేరుతో గార్బా (Garba)సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను దివ్య కుమార్ పాడగా, మీట్ బ్రోస్ కంపోజ్ చేశారు. తాజాగా ఆ పాటను ప్రధాని మోడీ యూట్యూబ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో విడుదల చేశారు. ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పాటను విడుదల చేసిన అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. శుభప్రదమైన నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న వేళ, గత వారం రోజులుగా తాను రాసిన గర్బా పాటను ప్రజలతో పంచుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. పాటను కంపోజ్ చేసిన మీట్ బ్రోస్, పాట పాడిన దివ్య కుమార్ కు ప్రధాని మోడీ ధన్య వాదాలు తెలిపారు.
ఈ పాట మొత్తం 4 నిమిషాల 40 సెకన్లు ఉంది. ఈ పాటను గుజరాతీలో పాడారు. గతంలో కూడా ప్రధాని మోడీ ఓ పాట రాశారు. ఈ పాట 190 సెకన్లు ఉంది. ఈ పాటకు గార్బో అనే టైటిల్ పెట్టారు. ఆ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటను తనిష్క్ బాగ్చీ కంపోజ్ చేయగా, ధ్వని భరద్వాజ్ గానం చేశారు.
గార్బో పాటను విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే యూట్యూబ్ లో వైరల్ అయింది. ఇప్పటికే మిలియన్ వ్యూవ్స్ దాటి పోయాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ దుర్గా మాత ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు, అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.