తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానని, తాను ఒక మంచి హిందువునని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) అన్నారు. అందుకే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.1.11 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని, ఆయన కన్నా తానే ఎక్కువ విరాళం ఇచ్చానని తెలిపారు.
ఆ చెక్కును అయోధ్య ట్రస్టుకు అందించాలని ప్రధాని మోడీకి పంపించానని పేర్కొన్నారు. కానీ ఆ చెక్కును ప్రధాని మోడీ తిరిగి తనకు పంపించారని వెల్లడించారు. ఆ చెక్కును మీరే నేరుగా ట్రస్టుకు పంపించండని ప్రధాని మోడీ తనకు సూచించారని వివరించారు. అనంతరం ఆ చెక్కును ట్రస్టుకు పంపించానని చెప్పారు.
ఇటీవల నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ‘కన్యా పూజ’క్రతువుపై రచ్చ జరిగింది. పూజలో భాంగా బాలికల పాదాలను సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్ కడిగారు. దీనిపై దిగ్విజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక డ్రామెబాజ్ (నాటకాలాడే వ్యక్తి) అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దాల ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదని మండిపడ్డారు.
సీఎం పదవిలో ఉన్న వ్యక్తి నాటకాలాడడం తానెప్పుడూ చూడలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు శివరాజ్ సింగ్ చౌహన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలికలను దేవతలుగా భావించి వారి పాదాలను కడిగి పూజ చేశామన్నారు. అది సనాతన సాంప్రదాయం అన్నారు. సనాతన సాంప్రదాయాలను కాంగ్రెస్ అవమానిస్తోందని, బాలికల కాళ్లు కడగడం తప్పా అన్న విషయం ఖర్గే, సోనియా గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.