ఇజ్రాయెల్ (Israel) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. గాజా ( Gaza)తో యుద్దం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ మద్దతు ఉన్నా లేకున్నా ఈ యుద్దంలో తాము ముందుకు వెళ్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇలీ కోహెన్ తెలిపారు. ప్రస్తుత దశలో కాల్పుల విరమణ అనేది ఉగ్రవాద సంస్థ హమాస్‌కు ఒక బహుమతిలా మారిందని మంత్రి వెల్లడించారు.
కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఇజ్రాయెల్ పౌరులను బెదిరించేలా హమాస్ మిలిటెంట్లకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ కు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ తో పాటు పలు దేశాల మద్దతు ఉందని తెలిపారు. కానీ క్రమంగా ఆ మద్దతు తగ్గిపోతోందన్నారు.
ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణ చేస్తున్న బాంబు దాడులే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుని వ్యాఖ్యల తర్వాత ఇజ్రాయెల్ తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు అనూహ్యంగా దాడికి దిగారు. ఇజ్రాయెల్ లో విధ్వంసం సృష్టించి అక్కడి పౌరులను బందీలుగా తమతో తీసుకు వెళ్లారు. దీనికి ప్రతిస్పందనగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్దం మొదలై మూడు నెలలు గడుస్తోంది. ఈ యుద్దంలో సుమారు 18,600 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిలో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నట్టు తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దేశంలో అపారమైన నష్టం జరిగిందని పేర్కొంది.