ఢిల్లీ మద్యం పాలసీ (Liquor Scam)కేసులో తనను అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ హైకోర్టులో(Delhi high court) సవాల్ చేయగా.. ఆ పిటిషన్‌పై స్పందించేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని ఈడీ(ED) తరఫు న్యాయవాది కోర్టును కోరారు.ఈడీ తరఫు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ‘మంగళవారమే మాకు కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందింది.
దాని పరిశీలించి బదులు ఇచ్చేందుకు 3 వారాల సమయం కావాలి’ అని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆప్ లాయర్ ఏఎం సింఘ్వీ స్పందిస్తూ..‘వాస్తవానికి ఈనెల 23న తాము హైకోర్టులో పిటిషన్ వేశామని అప్పుడే దానికి సంబంధించి సమాచారం అందుబాటులోకి వచ్చినా విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో ఈడీ మరింత గడువు కోరుతోంందని’కోర్టుకు తెలిపారు.
ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారంతో ఆయన రిమాండ్ కస్టడీ ముగియనుంది. ఆలోపు హైకోర్టు తగిన నిర్ణయం ప్రకటించాలని కేజ్రీవాల్ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే, దీనిపై కాసేపటి తర్వాత మళ్లీ విచారిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు.
కాగా, కేజ్రీవాల్ రిమాండ్ గడుపు గురువారంతో ముగియనుండగా.. తిరిగి ఆయన్ను శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే, కేజ్రీవాల్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును ప్రకటించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు.ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన కవితకు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ఇకపోతే, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన డబ్బుల గురించి సునీతా కేజ్రీవాల్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం ఆమె తన భర్తను కలిసేందుకు జైలుకు వెళ్లగా.. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో కోర్టు ద్వారా దేశప్రజలకు చెబుతానని కేజ్రీవాల్ తనతో చెప్పారని ఆమె వెల్లడించారు.అంతేకాకుండా తన భర్తకు డయాబెటిస్ ఉందని, షుగర్ లెవల్స్ సరిగ్గా లేవని వెల్లడించారు.