హిందూవుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలోని విశ్వనాథ ఆలయం. ఈ గుడి పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంటుంది. ఈ మసీదు స్థానంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని, 17వ శతాబ్దంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని పాక్షికంగా పడగొట్టి, దాని గోడలపైనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఈ వివాదంపై కోర్టు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వివాదంపై ‘ట్రూ ఇండాలజీ’ ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
1669లో హిందూవుల పరమ పవిత్రమైన కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు ధ్వంసం చేశాడు. తరువాతి 300 సంవత్సరాలుగా హిందువులు విశ్వనాథుని కోసం అనేక యుద్ధాలు చేశారు. ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. సర్వస్వం త్యాగం చేశారు. నిజానికి, 1664లో తొలిసారిగా కాశీ విశ్వనాథుడి ఆలయంపై ఔరంగజేబు దండయాత్ర చేశాడు. తన సైన్యంతో కలిసి దండెత్తాడు. కానీ, దశనామి, నాగసాధువులు ఔరంగజేబు సైన్యాన్ని అడ్డుకున్నారు.
ఆనాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యుద్ధం సాగింది. తక్కువ మంది ఉన్నా.. నాసిరకం ఆయుధాలు ఉన్నా.. ఔరంగజేబు సైన్యాన్ని సాధువులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి వేయాలన్న మొఘల్ సుల్తాన్ ఆదేశాల మేరకు 1669లో మొఘల్ సైన్యం మరోసారి దాడి చేసింది. ఈ సారి తిరుగుబాటును అణిచి వేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయంపై డోమ్ ను నిర్మించారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ఔరంగజేబు.. హిందూవులను ఆ స్థలం నుంచి వెళ్లగొట్టాలని అనుకున్నాడు. కానీ, మొండి పట్టుదల గల హిందూవులు అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. మొఘల్ సైన్యం వెళ్లిపోయిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. జ్ఞానవాపి నిర్మాణాన్ని సందర్శించి ఆ డోమ్ లోనే శివునికి పూజలు చేశారు.
ఆలయాన్ని ఔరంగజేబు ధ్వంసం చేసిన మూడు ఏండ్ల తర్వాత 1672లో రాజపుత్ర వంశానికి చెందిన రేవా రాజు మహారాజా భవసింగ్ కాశీ విశ్వనాథునికి పూజలు చేశాడు. ఆ తర్వాత 1677లో ఉదయ్ పూర్ రాజ్ మహారాజా జగత్ సింగ్, 1695లో రేవా రాజు అనిరుద్ద సింగ్ పూజలు చేశారు. ఆ తర్వాత 1734లో ఉదయ్ పూర్ రాజు మహరాజా జవాన్ సింగ్ శివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. జవనేశ్వర పేరిట ఆ శివలింగం ఇప్పటికీ అక్కడే ఉంది. 1749లో ఉదయ్ పూర్ రాజు మహరాణా సంగ్రామ్ సింగ్ పూజలు చేశాడు. క్రమక్రమంగా జ్ఞానవాపిలో పూజలు చేయకుండా హిందూవులను మొఘల్స్ అడ్డుకోలేకపోయారు.
1809లో జ్ఞానవాపి మసీదుపై గోసైన్ సాధువులు దాడి చేశారు. యుద్ధం తర్వాత ముస్లింలను అక్కడి నుంచి సాధువులు వెల్లగొట్టారు. అక్కడ కరసేవ చేశారు. దీంతో ముస్లిం పెద్దలు బ్రిటీష్ వాళ్ల సహాయాన్ని కోరారు. చాలా సుదీర్ఘమైన యుద్ధం తర్వాత బ్రిటీష్ సైన్యం మాత్రమే గోసైన్ సాధువులను అడ్డుకోగలిగింది. తర్వాత 1811లో ముస్లింలు ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను పరిశీలిస్తే మసీదు కింది భాగంలో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఆ ప్రాంతంలో హిందూవులు పూజలు చేసినట్టు అనిపిస్తోంది అంటూ ‘ట్రూ ఇండాలజీ’ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.