రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన కొన్ని నెలలకే మొన్నటివరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ (Congress), బీజేపీ(BJP)లోకి జంప్ చేస్తున్నారు. గులాబీ బాస్ మౌనం కూడా వలస నేతలకు రూట్ క్లియర్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి కేసీఆర్ మౌనం వీడితే పార్టీ మారాలనుకునే వాళ్లు వెనక్కి తగ్గొచ్చని గులాబీ కేడర్ అభిప్రాయపడుతోంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీలైనంత కీలక లీడర్లను తమ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు నయానో బయానో, పార్టీ పదవుల ఆశ చూపించి వారికి కాంగ్రెస్ కండువా కప్పుతోంది. ఎందుకంటే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకే బీఆర్ఎస్ను సగం ఖాళీ చేయాలని ఆయన దృఢమైన సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు చేరగా..తాజాగా మహబూబ్ నగర్ జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి (Zp chair person swarna sudhakar reddy) బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ టైంలో మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్న వంశీచంద్ రెడ్డి కూడా ఆమె వెంట ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైన ఎమ్మెల్సీ స్థానాలను గెలిచేందుకు ముందస్తు వ్యూహంలో భాగంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ గాలం వేస్తున్నది.కాగా, ఇటీవలే మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.