మేడారం (Medaram)సమ్మక్క, సారక్క జాతరకు హాజరయ్యే భక్తులకు అటవీ శాఖ (Forest Department) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న నామమాత్ర పర్యావరణ రుసుమును జాతర నేపథ్యంలో వసూలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపింది. జాతర ముగిసే వరకు పర్యావరణ రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేసింది.
అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు పర్యావరణ రుసుము వసూలును పూర్తిగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారం నుంచి వచ్చే వాహనాల నుంచి అటవీ శాఖ నామ మాత్రంగా పర్యావరణ రుసుమును వసూలు చేస్తూ వస్తోంది. ఈ రుసుము ద్వారా వచ్చే ఆదాయాన్ని అటవీ ప్రాంతాల రక్షణకు, వన్య ప్రాణుల సంరక్షణకు, ప్లాస్లిక్ ను తొలగించేందుకు ఉపయోగిస్తోంది.
జాతర నేపథ్యంలో ఈ పర్యావరణ రుసుమును నిలిపి వేయాలని వివిధ వర్గాల నుంచి అటవీ శాఖకు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతర ముగిసే వరకు పర్యావరణ ఫీజు వసూలును నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని పరిశుభంగ్రా ఉంచాలని కోరుతోంది.