ఏ టూరైనా ప్లాన్ చేస్తే సమయం ఆదా చేసుకునేందుకు కాస్త ధర ఎక్కువైనా విమాన ప్రయాణాలు చేయడం లేటెస్ట్ ట్రెండ్. ప్రయాణాల సందర్భంగా తక్కువ ధరకు ఏ యాప్ లేదా ఏ కన్టెల్టెన్సీ విమాన టిక్కెట్లు ఇస్తుందని ఎంక్వైరీ చేస్తుంటాం కదా. ఇకపై ఆ ఎంక్వైరీని గూగుల్ లో కూడా చేస్తే మనకు తక్కువ ధరకే విమాన టిక్కెట్లు (flight tickets) లభిస్తాయి. అందుకే మనం ఎంత హడావిడి ప్రయాణం (flight journey) పెట్టుకున్న ముందు ఒకసారి గూగుల్ తల్లిని సంప్రదిస్తే…తక్కువ ధరకే టిక్కెట్లు లభించే అవకాశం ఉంది. దీనిని మీరు ప్రయత్నించండి. ఎలాగంటే…
గో టూ ‘గూగుల్ ఫ్లైట్స్’
మనం ప్రయాణం ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి తాజాగా అందుబాటులోకి వచ్చిన గూగుల్ ప్లైట్స్ ఫీచర్ చూస్తే సరి. దీనిలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో వివరాలను ఇస్తే చాలు…మన వెళ్లాలనుకునే ప్రదేశానికి ఏ రోజున టిక్కెట్ ధరలు తక్కువలో లభిస్తున్నాయో చూపిస్తుంది. దానిని బట్టి మనం మన విమాన టిక్కెట్లను బుక్ (tickets booking) చేసుకోవచ్చు.
గూగుల్ ఫ్లైట్స్ లో తక్కువ ధరకే టిక్కెట్లు లభిస్తున్న తేదీలతో పాటు ఆ ఫ్లైట్ ఎన్ని గంటల్లో గమ్యస్థానాన్ని చేరుతుంది, అలాగే సమీపంలో ఉన్న నగరాలు, దేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం ఆ ప్రదేశాలకు కూడా ఏ ధరలో టిక్కెట్లు లభిస్తున్నాయో చూపిస్తుంటుంది. మనకు ఇతర ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే అది కూడా ఉపయోగపడుతుంది.
డొమెస్టిక్ టూ ఇంటర్నేషనల్
విశాఖపట్నం, హైద్రాబాద్, దిల్లీ, ముంబాయి ఇలా దేశంలోని వివిధ నగరాలకే కాకుండా విదేశాలకు వెళ్లాలనుకున్నా కూడా గూగుల్ ఫ్లైట్స్ మనకు ఎప్పుడు, ఏ సమయంలో తక్కువ ధరకు విమాన టిక్కెట్లు లభిస్తాయనే వివరాలను అందిస్తూ సహాయపడుతుంది. విమాన సౌకర్యమున్న ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన ప్లైట్స్ ధరలనైనా…అందులోనూ తక్కువ ధరలు లభించే సమయాలను గూగుల్ ఫ్లైట్స్ అందిస్తోంది.
గూగుల్ ప్లైట్స్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే మన ట్రిప్ బడ్జెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్ ఫ్లైట్స్ లో అందుబాటులో ఉన్న ప్రైస్ ట్రాకింగ్ అలర్ట్స్, ప్రైస్ గ్యారంటీ చాయిస్లకు అదనంగా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో తక్కువ ధరకు లభించే విమాన టిక్కెట్ల వివరాలను క్షణాల్లోనే పొందవచ్చు. డెస్టినేషన్ డేటా ఇస్తే చాలు…వెంటనే తక్కువ ధరకు లభించే విమాన టిక్కెట్ల వివరాలను అందిస్తుంది.
ధర తగ్గితే…మనకు డబ్బులు వస్తాయి
కొన్నిసార్లు మనం విమాన టిక్కెట్లు బుక్ చేసిన తర్వాత ధరలు తగ్గుతాయి. అప్పుడు అయ్యో… మనం అనవసరంగా ఎక్కువ ధరకు బుక్ చేసుకున్నామే అని బాధపడతాం. కానీ ఇప్పుడు ఆ భాద కూడా తప్పినట్లే. ఎందుకంటే గూగుల్ కొన్ని ఎంపిక చేసిన రూట్లలో గూగుల్ ఫ్రైస్ గ్యారంటీ చాయిస్ అందిస్తోంది. ఇది ఎలాగంటే విమాన టిక్కెట్ల రేట్లపై బ్యాడ్జ్ ఉంటుంది. ఇది అన్ని రూట్లకు కాదు, కొన్ని రూట్లకే వర్తిస్తుంది. ఆ బ్యాడ్జ్ ఉందంటే ఆ రూట్ టిక్కెట్లలో అదే అతి తక్కువ ధర అని అర్థం. ఇలాంటి రూట్లలో మనం టిక్కెట్ బుక్ చేసుకున్న తర్వాత టిక్కెట్ ధర తగ్గిందనుకొండి, ఆ తగ్గిన మేర డబ్బును ప్రైస్ గ్యారంటీ పేరుతో మనకు గూగుల్ పే ద్వారా జమ చేస్తారు.