రోజ్ గార్ మేళా (Rozgar Mela) అనేది ఈ దేశ యువత పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను చూపుతుందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. యువత ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం మిషన్ మోడ్లో పని చేస్తోందని వెల్లడించారు. తాము కేవలం నియామక పత్రాలను పంపిణీ చేయడమే కాదని, వ్యవస్థను కూడా పారదర్శకంగా మార్చామని చెప్పారు.
కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికైన 51 వేల మందికి వర్చువల్గా ప్రధాని మోడీ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…… రక్షణ పరిశ్రమ, పునరుత్పాదక ఇంధనం, ఆటోమేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తమ ప్రభుత్వం ఉద్యోగావకాశాలను పెంచిందని తెలిపారు. గతేడాది అక్టోబర్లో రోజ్గార్ మేళాను ప్రారంభించామన్నారు.
కేంద్రంతో పాటు బీజేపీ, దాని మిత్ర పక్షాలు అధికారంలో వున్న ప్రాంతాల్లో రోజ్ గార్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని వెల్లడించారు. నేడు 51,000 మందికి పైగా నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. నూతనంగా నియామక పత్రాలు పొందిన వారి కుటుంబాలకు ఇది ముందస్తు దీపావళి లాంటిదన్నారు.
దేశంలో నూతన ఉపాధి అవకాశాలను సృష్టించామన్నారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్లోని ధోర్డో గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఐరాస గుర్తించిందన్నారు. అంతకు ముందు బెంగాల్లోని శాంతినికేతన్, కర్ణాటకలోని హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించిందన్నారు. ఇది ఉపాధి అవకాశాలను, ఆర్థిక వ్యవస్థ విస్తరణను పెంచిందన్నారు.