డీప్ ఫేక్ (Deep Fake Videos) వీడియోలకు, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టాలు (NeW Act) తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ (Rajiv Chandrashekar)వెల్లడించారు.
తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునే విషయంపై పలు సోషల్ మీడియా కంపెనీల ప్రతినిధులతో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ సమావేశం కానున్నారు. మొత్తం రెండు సమావేశాలను కేంద్రం నిర్వహించనుంది. గురు, శుక్రవారాల్లో రైల్ భవన్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డీప్ ఫేక్ వీడియోలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మీడియాతో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ…. ఇతరులకు హాని కలిగించేందుకు, సమాజంలో గందరగోళం, హింసను ప్రేరేపించే ఉద్దేశంతో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర రకాల తప్పుడు సమాచారాన్ని ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తాము చాలా శ్రమించి ఈ ఏడాది ఐటీలో నూతన నిబంధనలను రూపొందించామన్నారు. తాము డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన కొత్త చట్టాలను తీసుకు వస్తామన్నారు. కేవలం చట్టాలకే పరిమితం కాకుండా దాని కోసం ఒక నిర్ధిష్టమైన ప్రణాళికను, వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు.