– మహిళా బిల్లుపై గవర్నర్ ట్వీట్
– ప్రతిపక్ష పార్టీలకు పరోక్ష చురకలు
– మోడీ చొరవ అద్భుతమని ప్రశంస
ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును కేంద్రంలోని మోడీ (Modi) సర్కార్ నారీశక్తి వందన్ అభియాన్ పేరుతో లోక్ సభ ముందుకు తీసుకొచ్చింది. దిగువ సభలో ఇద్దరు సభ్యులు మినహా అందరూ ఆమోద ముద్ర వేశారు. ఇన్నాళ్లకు ఈ బిల్లుకు మోక్షం లభిస్తుండడంతో మహిళా నాయకులు, ఇతర ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai) ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇంకోవైపు పలు పార్టీలకు చురకలంటించారు.
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లును ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతంగా ఆమోదింపచేశారని అన్నారు తమిళిసై. సాధ్యం కాని వాగ్ధానాలు, రాజకీయ వారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు మోడీ చొరవ ముందు అదృశ్యమయ్యాయని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధానికి యావత్ దేశం కృతజ్ఞతలు తెలుపుతున్నది అంటూ ట్వీట్ చేశారు.
మహిళా బిల్లు క్రెడిట్ తమదంటే తమదని పార్టీల మధ్య వార్ నడుస్తోంది. కవిత, కేసీఆర్ కృషి వల్లే కేంద్రం దిగొచ్చిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. దశాబ్దాలుగా దీనిపై తాము పోరాడుతున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మహిళా బిల్లు కాంగ్రెస్ మానసపుత్రిక అని గత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. రాజకీయ వారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు అంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యలు వారసత్వ రాజకీయ పార్టీలను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు ఉందని అందరూ అనుకుంటున్నారు.
మరోవైపు, మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. గురువారం సభ ప్రారంభంకాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. భయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.