పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter Session) డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కెంద్రం రెడీ అవుతోంది. అందులో మహిళా రిజర్వేషన్లను జమ్ము కశ్మీర్, పుదుచ్చేరిలకు వర్తింప చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులు ఉన్నాయి. వాటితో పాటు మూడు నేర శిక్ష్మాస్మృతి బిల్లులు ఉన్నాయి.
జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు ఈ సమావేశాల్లో ఓ బిల్లును తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే అసెంబ్లీ స్థానాల సంఖ్య 107 నుంచి 114కు పెరగనుంది. కశ్మీరీ వలస వెళ్లిన వారికి, శరణార్థులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ బిల్లులతో పాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమీక్ష, ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇదే సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి సంబంధించిన బిల్లును ఆమోదించనుంది. శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు.
ఈ సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభం కానున్నాయి. 22 తేదీన ముగియనున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు తాము రెడీగానే ఉన్నామని అధికార పక్షం వెల్లడించింది.