పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ (Library)లో అఖిల పక్ష సమావేశం (All Party Meeting) కాసేపటి క్రితం ముగిసింది. అఖిల పక్ష సమావేశానికి 23 పార్టీలకు చెందిన 30 మంది నేతలు హాజరైనట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.ఈ నెల 4 నుంచి సమావేశాల ప్రారంభం కానున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం 15 సెషన్లు ఉంటాయని పేర్కొన్నారు.
అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఎప్పటిలాగే జీరో హవర్ కొనసాగుతుందన్నారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించాలని అన్ని పార్టీలను కోరామన్నారు. చర్చల సమయంలో సభా నియమాలు, విధానాలను అనుసరించాలన్నారు. నిర్మాణాత్మకమైన చర్చలకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు.
ఈ సమావేశాలకు కేంద్రం నుంచి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జైరాం రమేశ్, ప్రమోద్ తివారీ, గౌరవ్ గగోయ్ ,టీఎంసీ సుదీప్ బంధోపాద్యాయ్, డరెక్ ఓబ్రెయిన్, జేఎంఎం మహువా మాజీ, ఎస్సీ నుంచి హసన్, బీఎస్పీ నుంచి గిరీశ్ చంద్ర ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. వైసీపీ, బీఆర్ఎస్లు ఈ పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యాయి.
వచ్చే ఏడాది లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ సారి ఇవి చివరి సమావేశాలు. దీంతో ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను ఆమోదించాలని చూస్తోంది. మొత్తం 18 బిల్లులను ఇప్పటికే కేంద్రం లిస్టు చేసింది. అందులో జమ్ముకశ్మీర్, పుదుచ్చేరిలకు మహిళ రిజర్వేషన్ బిల్లు వర్తింపు, ఐపీసీ, సీఆర్పీసీల స్థానంలో తీసుకు వస్తున్న మూడు నేర శిక్షాస్మృతి, ఇతర బిల్లులు వున్నాయి.