వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన మంత్రులు. మంత్రుల హోదాలో తొలిసారి జిల్లాకు వెళ్లిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కి ఘన స్వాగతం లభించింది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నాయకన్ గూడెం బస్టాండ్ సెంటర్ లోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రోడ్డు మార్గం ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
భట్టి మాట్లాడుతూ.. సంపదను సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. ఐటీని అభివృద్ధి చేస్తామని, సంపదలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ప్రజలు ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. అర్థరాత్రి అయినా తమ దగ్గరకు రావచ్చని, పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే, పాత్రికేయుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పథకాలు ప్రారంభించడమే కాదు అమలు చేస్తుందని తెలిపారు.
భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో మంత్రిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. తప్పుడు కేసులు పెట్టిన పోలీస్ అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎక్కడ ఉన్నా తెలంగాణలో పనిచేయాలన్నారు. అధికారులు తీరు మార్చుకొని ప్రజా సేవ చేయాలని హితవు పలికారు. భూ కబ్జాలపై కలెక్టర్, ఎస్పీ దృష్టి పెట్టాలని.. ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకముందే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువలు లేని ఆయనే.. తెలంగాణను దోచి మామకి కట్టపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శలా? అని ప్రశ్నించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. తిన్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన మీరా తమ ప్రభుత్వం గురించి మాట్లాడేది అంటూ హరీష్ రావును ఉద్దేశించి పొంగులేటి ఫైరయ్యారు.