భారత స్వాతంత్య్ర పోరాటాన్ని కీలక మలుపు తిప్పిన ఘటన సిపాయిల తిరుగుబాటు. భారతీయులు (Indians) తలుచుకుంటే ఈస్టిండియా కంపెనీల మూలాలు కదిలిపోతాయని నిరూపించిన గొప్ప ఉద్యమం ఇది. అందుకే, దీన్ని మొదటి స్వాంతంత్య్ర పోరాటం (first war of indipendence) అంటారు. సిపాయిల తిరుగుబాటు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే పేరు ఉత్తర భారత్.
కానీ, ఈ తిరుగుబాటుకు దక్షిణ భారత్ కు అనుబంధం ఉందని, ఆ పోరాటంలో మనకు కూడా ఒక గొప్ప హీరో ఉన్నాడని చాలామందికి తెలియదు. ఆ రణతంత్ర ధీరుడే తుర్రెబాజ్ ఖాన్. సిపాయిల తిరుగుబాటుకు హైదరాబాద్ లో నాయకత్వం వహించింది ఈయనే. 1857 జూలై 17న కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీపై మెరుపు దాడి చేసి తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
తన స్నేహితుడు మౌల్వీ అల్లావుద్దీన్ తో కలిసి బ్రిటీష్ వాళ్లకు తెలంగాణ తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూపించాడు. దీంతో అటు నిజాం ప్రభువు, ఇటు బ్రిటీష్ పాలకుల్లో వణుకు పుట్టింది. ఎలాగైనా తుర్రెబాజ్ ఖాన్ ను మట్టుపెట్టి ఉద్యమాన్ని అణచి వేయాలని అటు బ్రిటీష్, ఇటు నిజాం నిర్ణయానికి వచ్చారు.
ఈ మేరకు తుర్రెబాజ్ గురించి సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అంటూ ప్రకటన చేశారు. డబ్బు కోసం ఆశ పడిన ఖుర్బాన్ అలీ.. తుర్రెబాజ్ గురించి సమాచారాన్ని అందజేశాడు. ఖుర్బాన్ అలీ ఇచ్చిన సమాచారం మేరకు 1859 జనవరి 24న నిజాం సైనికులు తుప్రాన్ కు చేరుకున్నారు. తుర్రెబాజ్ ను చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించారు. దీంతో తుర్రెబాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఆయన శవాన్ని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ గుమ్మానికి వేలాడదీశారు.